నేను ఈ పాట వింటున్నా,
" ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది...
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది"
ఇది ఎక్కడో విన్నట్టు ఉంది అనుకునేరు, "సిరివెన్నెల" సినిమాలోది. ఏ మాటకీ ఆ మాటే చెప్పుకోవాలి, మన సీతారామ శాస్త్రి గారిని ఈ పాటని కూర్చినందుకు ఎన్ని సార్లు అభినందించినా తక్కువే!
బాగుంది కదా! తిట్టాలనుకుంటే ఎలా అన్నా తిట్టచు, తల్చుకోవాలనుకుంటే ఎలా అన్నా తల్చుకోవచ్చు! [:D]
ఎందుకో ఈ పాట వింటూ ఉంటే, నాకు ఈయన అడిగిన దానికి "శ్రీనాధ" కవి సార్వభౌములు వారు చెప్పిన ఈ పద్యం గుర్తుకు వచ్చింది,
" సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపమున కిద్ద రాండ్రా
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్ || "
అదేమిటయ్యా, ఆ పాట వింటూ ఉంటే ఈ పద్యం గుర్తుకు రావటం అని అనుకోవచ్చు, ఆ సంబంధం ఏమిటీ అంటే,
ఒకటి, సిరివెన్నెల వారు శివుణ్ణి ఏమి కోరేది ఏమి అడిగేది అని, పరమేశ్వరుడు ప్రపంచం లో చేసిన అన్యాయాలను (ఇంకా మంచి పదం దొరకటం లేదు, అందుకని ఇప్పటికి ఇదే!) ప్రశ్నిస్తూ ఉంటే, అక్కడ శ్రీనాథుల వారు ఒక భిక్ష గానికి ఇద్దరు పత్నులు దేనికి అని చమత్కరించారు.
రెండోది, 'ఏమి కోరేది ఏమి అడిగేది' అని ఒకరు బాధపడుతుంటే, 'పార్వతి చాలు గంగను విడు' అని సమాధానం ఇచ్చినట్టు లేదు!
సాహిత్య సాగరానికి, మనిషి ఆలోచనకి అంతం ఎక్కడ?
సెలవు!